Tuesday, February 10, 2009

చెంచుల ఆశాకిరణం పొడిచింది... అస్తమించింది______________________________________________________________________నల్లమల చెంచులు అడవి లోని జంతువుల కంటె హీనంగా బతుకుతూ, చెదలుకంటే కనాకష్టంగా బతుకు ముగిస్తున్న విషయం ముందు రాసిన పోస్టులలో చూసాము. చీకటి మయమైన వారి జీవితాల్లోకి కూడాకొంత వెలుగు వచ్చినప్పటికీ అది మెరుపులా మాయమైయింది.ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఉత్తర తెలంగాణాలొ ముమ్మరమైన అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం క్రమానుగతంగా దక్షిణ తెలంగాణా లో పాదుకుంటున్న సమయంలోనే అనివార్యంగా ఆ పార్టీ సాయుధ కార్యకర్తలు నల్లమలలోకి ప్రవేశించారు. మొదట మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాలలొ ప్రవేశించిన వీరు ఆతరువాత గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాలలొని నల్లమల అడవులను తమకు రక్షణ దుర్గాలుగా మలుచుకున్నారు.అప్పటికి ఖాకీ రంగు దుస్తులు ధరించి తమను గొడ్లను బాధినట్లు బాదిన మలబారు పోలీసుల(తెలంగాణ సాయుధ పోరాట కాలం) గురించి,తాము పొలాల్లో జొన్న కంకులో,వడ్లగింజలో తెచ్చుకోను పోతే చావచితక్కొట్టిన తెల్ల బట్టల రైతుల గురించి మాత్రమే తెలిసిన చెంచులకు ఆలివ్ గ్రీన్ రంగు దుస్తుల్లో మెరిసి పోతున్న సాయుధులు మొదట వింతగానే కనిపించారు.వారు ధరించిన దుస్తుల్లో తేడా వున్నట్లే వారి ప్రవర్తనలో తేడాను కూడా అడవి బిడ్డలు పసిగట్టారు.అప్పటి నుండి ఏ చెంచు గూడేనికైనా దళం వచ్చిందంటె చాలు కడుపు నొప్పి నుండి జ్వరాలదాకా బీమారీ ఏదైనా సరే చెంచులు అన్నలనే ఆశ్రయించేవారు. దళం డాక్టరు కూడా తన పరిమితి మేరకు కిట్ లో వున్న మందులతో వారికి వైద్యం చేసేవాడు.అన్నలు గూడేలలో చదువులు చెప్పేవారు. ఈ క్రమంలోనే శుభ్రత, ఆరోగ్య సూత్రాలను పాటించడం కూడా వారికి అన్నలు వంట బట్టించారు. అయినప్పటికి చెంచులు తాగుడును మానుకోలేక పోవడం వారి అభివృధ్దికి ఆటంకంగా మారింది. కడుపుకు తినే తిండిని ముట్టుకుంటే రైతులు ఎందుకు వెంటపడి తరిమితరిమి కొడతారో అర్థం కాని చెంచులకు వారి లాగా తామూ పంటలు పండించాలని ఆశపడేవారు. ఐటిడిఏ వాళ్ళు అప్పుడప్పుడు ఎద్దులు ఇప్పిస్తామంటూ పట్టణాలకు తీసుకు వెళ్ళినపుడు అక్కడ కనిపించిన ఎద్దులన్నీ తమవయితె బాగుండని వారి కనిపించేది. కానీ ఫోటోల వరకే అవి తమతో వుండేవి.ఆతరువాత తాగడాని బ్రోకర్లు ఇచ్చే డబ్బులు తమను మైకంలో ముంచి తేల్చేసరికి అవి మళ్ళీ కనిపించేవి కావు. వ్యవసాయం చెంచులకు ఎప్పుడు ఫలించని స్వప్నంగానే వుండేది. అందుకే అన్నలు చెంచులకు సేద్యం మీద వుండే మక్కువను వుపయోగించి వారిని మద్యపానానికి దూరం చేసే పని మొదలు పెట్టారు. గూడెమంతా ఓ కట్టుబాటుకు వచ్చి సామూహికంగా మద్యపాన నిషేధం పాటిస్తే ఆగూడేనికి వ్యవసాయం నేర్పేందుకు పీపుల్స్ వార్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకు అవసరమైన భూమి తయారు చేయడంతో పాటు ఎద్దులు, పెట్టుబడి అంతా వారే సమకూర్చేవారు.మైదాన ప్రాంతాల నుండి రైతులను పిలిపించి చెంచులకు వ్యవసాయంలో మెళకువలు నేర్పించేవారు.అప్పటికే వ్యవసాయంలో కొంత జ్నానం సంపాదించిన మహబూబ్ నగర్,ప్రకాశం జిల్లాలలోని చెంచులతో పాటు కర్నూలు పరిధిలోని నల్లమల చెంచులు తమ జీవన పరిణామ క్రమంలో వేల సంవత్సరాలుగా జరగని మార్పును ఇలా ఒక్కసారిగా పొందారు. ఈక్రమంలో ఎంతోమంది చెంచులు ఉద్యమాలలోకి కూడా వెళ్ళారు.అప్పటికే పీపుల్స్ వార్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచుతున్న రాజ్యానికి మత్తుకు దూరంగా పచ్చగా కనపడే చెంచు గూడేలు ఉద్యమ ప్రాంతాలుగా కనిపించ సాగాయి.దీంతో తాగని ప్రతి చెంచు, ఓ నక్సలైట్ గాను, వ్యవసాయం చేసుకునే గూడేలు విముక్తి ప్రాంతాలుగా కనిపించ సాగాయి.అడవి బిడ్డలు ఘోరమైన రాజ్య హింసకు గురయ్యారు.తాగని చెంచుకు తన్నులు నిత్యకృత్యమయ్యింది.అన్నలు గూడేల వైపునే కాదు నల్లమలలోనే లేకుండా చేయడంలో రాజ్యం సఫలీకృతమయ్యింది. నేడు తిరిగి నల్లమలలో మట్టిగొట్టుకుని పడివున్న చెంచులు మన కళ్ళకు కనిపిస్తారు. బక్కచిక్కిన శరీరాలతో కళ్ళళ్ళో ప్రాణాలు నిలుపుకుని ఎవరి రాకకోసమో ఎదురుచూస్తు నేలకు కర్చుకుని వున్నారు. వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థలు మరింత జోరుగా వారి పేరున పద్దులు రాసి కోట్లాది రూపాయలను కైంకర్యం చేస్తూ ఉన్నాయి.

1 comment:

  1. malli vaalla asthaminchani aashakiranaalu udainchalani korukuntu.gajula

    ReplyDelete