Monday, January 12, 2009
చెంచులు అడవి తల్లి ముద్దుబిడ్డలు...దొడ్డ సంస్కృతికి జీవగడ్డలు<>నల్లమల అడవుల్లో మాత్రమే జీవించే చెంచుల(primitive tribe) అలవాట్లు,జీవన విధానం,సంస్కృతి వైవిధ్య భరితంగా ఉంటుంది. చేతిలొ విల్లంబులు,బుజాన గొడ్డలి,ముందు పెంపుడు కుక్క,వెనుక భార్య..ఇది పొద్దున్నే ఆహారసేకరణకు అడవి లోకి బయలు దేరే చెంచన్న తీరు. ఆరు నూరైనా ఇదిమారదు.పులి,రేచు కుక్కలు(wild dog's) లాంటి మాంసాహార జంతువులు వేటాడి వదలిన మాంసము,అడవుల్లో వుండే రకరకాల దుంపలు వీరి ఆహారం.ఆకలి తీరితే అడవిలోని పొదలే వీరి శయ్యాగారాలు. పగటి పూటే వీరి శృంగారం.రాత్రి మైధునం వీరికి నిశిద్దం.మగ్గి నేలరాలిన విప్ప పువ్వులను సేకరించి అధ్బుతమైన మధ్యాన్ని తయారు చేసుకుని సేవిస్తారు. ఇందుకు ఆడా,మగా,పిల్లలన్న తేడా లేదు. చెంచుల్లో మద్యపానం మొదట వ్యసనం కాదు. ఆహారపు అలవాటు మాత్రమే.ఇష్టపడ్డ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించ డంతో వీరి పెళ్ళీ తంతు మొదలవుతుంది. తరువాత కొత్తబట్టలు తెచ్చి వాటిని ధరించి మేకనొ,గొర్రెనో కోసుకుని తిని తెల్లవార్లు ఆడిపాడీ అలసిసొలసి పడిపోవడంతో పెళ్ళి తంతుముగుస్తుంది. రాత్రంతా సారాజోరు సాగుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.గొలుసన్న,ఈదన్న,మంతన్న లాంటిపేర్లు పెట్టుకుంటారు. తమదైన గిరిజన మాండలికంలో తెలుగు భాషనే మాట్లాడతారు.వెదురు బొంగులు,అడవిలో లభించే కాశిగడ్డితో వేసుకున్న చిన్న అందమైన పూరిగుడిసెలలో నివాసముంటారు. ఈగుడిసెలు వర్తులాకారంలో ఎంతో అందంగా ఉంటాయి. APటూరిజం వారు కూడా వీటి ఆకారం లోనే తమ రిసార్ట్ లను నిర్మించడం వీటి విశిష్టతను తెలియజేస్తుంది.ఇంతటి అందమైన ఇళ్ళు ఉన్నప్పటికి చెంచులు వీటిలో పగలు మాత్రమే ఉంటారు.రాత్రిళ్ళు ఇళ్ళలో పడుకుంటే పైకప్పు కూలి మరణిస్తామన్న మూఢనమ్మకంవల్ల ఆరుబయట నిద్రిస్తారు.ఇందుకోసం వీరు తయారు చేసుకున్న శయ్య కళాత్మకంగా ఉంటుంది. లావుపాటి వెదుర్లను పగలగొట్టి మంచ పై పరచడం వల్ల వెదురు పానుపు తయారవుతుంది.ఇది ఒరకంగా రచ్చబండలా ఉంటుంది.చెంచుల శరీరంలో భాగంగా మారిన విల్లంబుల తయారీలో కూడా చెంచుల కళాత్మకత ఉట్టిపడుతుంది.వింటికి అవసరమైన దబ్బ,వింటి నారి ఆసాంతం వెదురుతోనే తయారు చేసుకోవడం విశేషం. వెదురుతో ఎంతొ పనితనం ఉట్టిపడేలా తయారు చేసిన ఊసల ఓచివర ఇనుముతో బాణపు ములికిని పొదుగుతారు. రెండవ చివర గురిని నియత్రించడానికి పక్షి ఈకలనుఅమర్చుతారు.నల్లమల చెంచులు ఉపయోగించే ఈఅందమైన విళ్ళంబులను ప్రముఖ దర్శకుడు కేవిరెడ్డి తన శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో ప్రత్యేకంగా తెప్పించుకుని ఉపయోగించడం విశేషం.కొండవాగులలో చేపలు పట్టేందుకు ఉపయోగించే కొడిమె ను వెదురుతో అధ్బుతంగా తయారు చేసుకుంటారు.చెంచు పిల్లలలో సృజనాత్మకత పాలు కాస్త ఎక్కువే. నల్లమల అడవులో తిరిగే అన్నలు,పోలీసుల చేతులలో కనిపించే AK47,SLRతుపాకులను ఒకసారి చూస్తె చాలు చిన్నకత్తిని ఉపయోగించి వాటి నమూనాలను చిటికెలో తయారు చేయడం వారి ప్రత్యేకత.అడవుల్లో నిర్మాణం పనుల కోసం తిరిగే ట్రిప్పర్లను ఓమారు చూస్తే చాలు వాటి నమూనా తయార్. చెంచులలొ బహుభార్యత్వం అరుదు. వ్యభిచారం లేనేలేదు.వరకట్నం ప్రసక్తి లేదు. వరుసకు బావ ఐన వాడినే చెంచులు నమ్ముతారు. సోదరున్ని అసలు నమ్మరు.అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలలో విక్రయించి తద్వారా స్వయంపోషితంగా ఉన్న నల్లమల చెంచు జాతి పరాయీకరణకు గురై కృషించి పోతున్న వైనం పై మరోసారి చర్చిద్దాం<>
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment