Wednesday, April 15, 2009

ఇన్నాళ్ళకు చెంచులు ఓటర్లుగానైనా కనిపించారు.

ముందు రాసిన పోస్టులలో నల్లమల చెంచు గూడెం పెచ్చెరువు గురించి ప్రస్తావించి ఉన్నాను.దాదాపు మూడు దశాభ్దాల కిందట పులుల అభయారణ్యం కోసం అడవి నుండి ఖాళీ చేయించబడ్డ గిరిజన గ్రామమది.అడవిలోని ఆగూడెం అలా రెవెన్యూ రికార్డులనుండి మాయమైంది.మైదాన ప్రాంతలోని పునరావాసం ఒంటని చెంచులు తిరిగి అప్పుడే తమ పాత స్థలానికి తిరిగి చేరు కున్నారు.అప్పటి నుండి పెచ్చెరువు చెంచులు అటవీ ఫలసాయం అమ్ముకోవాలన్నా చౌకధరల దుఖాణం వెళ్ళాలన్న నలభై కిమీ నడచి వెళ్ళాల్సి వచ్చేది. అలాగే ఓట్ల కోసం కూడా వారికి ఇదే శ్రమ తప్పేది కాదు. కాకపోతే మరో పూట గురించి ఆలోచించుకోలేని ఆ అడవి బిడ్డలకు ఓట్లు ఎప్పుడు అంత అవసరమైన విషయాలుగా కనిపించేవి కావు.జనాభా లెక్కలకే ఎక్కలేని వారు వోటరు జాబితాకు మాత్రం ఎలా అతుకు తారు. కాగా ఇన్నేళ్ళ తరువాత లెక్కాధాఖలు లేని అటవి గ్రామంలో నివశిస్తున్న చెంచులకు ఓటు యోగం పట్టింది.పట్టుమంటే పాతిక మంది లేని ఆచెంచు గూడెంలో ఎన్నికల కమీషన్ పోలింగ్ బూతు పెట్టబోతోంది.నల్లమలను మావోయిస్టులు లేని ప్రాంతంగా చేశామని ప్రకటించు కొనడంలో భాగంగానే ఈ ఏర్పాటు జరిగినట్టుంది.నట్ట నడిమి నల్లమలలో ఎన్నికలు జరిపించ గలిగామన్న కీర్తి కండూతి అధికారులను ఇందుకు పురిగొల్పి ఉండవచ్చు.ఇరవై మందితో ఓట్లు వేయించుకునేందుకు రెండు వందల మంది పోలీసులనుఇందుకు వినియోగించు కోనున్నారు. ఇవిఎంలను తరలించేందుకు అవసరమైతే హెలికాఫ్టర్ ను ఉపయోగించేందుకు ప్రభుత్వం వెనుకాడక పోవచ్చు.చింతపండును బూడిదలో కలుపుకుని నీళ్ళుపోసి ముద్దచేసుకుని తిని కడుపు నింపుకున్న నాడు అదే చెంచులకు పట్టెడు కరవు బియ్యం అందించలేని వారు నేడు పయిమీద ఇంత బట్టలేని చెంచులతో వోట్లు వేయించేందుకు ఇంత కష్టపడుతూంటే అనుమానం రాకపోతే మనబుర్రలను ఓవర్ హాలింగ్ చేయించుకోవాల్సిందే. కేవలం క్షయలాంటి జబ్బులకే చెంచులు చస్తుంటే పలకరించే దిక్కులేని ప్రభుత్వాలు హెలికాప్టర్ ను ఉపయోగించి ఎన్నికలు జరపాలను కోవడం వెనుక పాలక వర్గ రాజకీయ ఎత్తుగడ ఏది ఉండదనుకోవడం మన అమాయకత్వం కాక మరేమిటి.